9, ఆగస్టు 2016, మంగళవారం

GST బిల్లు


కేంద్రం - రాష్ట్రం వేరువేరుగా పన్నులు వేయకుండా కేవలం కేంద్రమే దేశమంతా ఒకేలా పన్ను వేసే విధానమిది. అంటే ఒక వస్తువు ఆంధ్రప్రదేశ్ లో ఒక ధరకు.. గుజరాత్ లో మరో ధరకు దొరకదన్నమాట. దేశమంతా ఒకే ధర అమలవుతుంది. అక్కడ చవక.. ఇక్కడ ప్రియం అన్న ప్రశ్నే ఉండదు. అన్ని రకాలైన వస్తువులు - సేవలపై జీఎస్ టీ విధిస్తారు. ఒక వస్తువు లేదా ఒక సేవకు వివిధ దశల్లో జత కలిసే విలువ ఆధారంగా ఇన్ పుట్ క్రెడిట్ (పన్ను మినహాయింపు) లభిస్తుంది. చివరగా వినియోగదారుడు తాను ఎక్కడైతే వస్తువు లేదా సేవలు పొందుతున్నాడో అక్కడ ఆ వర్తకుడు చెల్లించే జీఎస్ టీని భరిస్తే సరిపోతుంది.
ఉదాహరణకు ఒక వస్తువు ఢిల్లీ నుంచి ముంబయి.. అక్కడి నుంచి హైదరాబాద్ కు తెచ్చి విక్రయిస్తున్నారే అనుకుందాం.. అప్పుడు ఢిల్లీలో దాని ధర రూ.1000 అనుకుంటే దానిపై తొలి విడతలో పన్ను 10 శాతంగా తీసుకుందాం. అప్పుడు అది ముంబయి వచ్చేసరికి రూ.1100 అవుతుంది. అక్కడి వర్తకుడు ఆ వస్తువును మెరుగుపరిచే విక్రయానికి సిద్ధంగా మార్చడం వల్లో లేదంటే లాభంగానో దానిపై మరో వెయ్యి రూపాయలు అదనపు ధర వేసుకుంటాడు. అప్పుడు అక్కడ దానిపై మరో 10 శాతం పన్ను వేశారనే అనుకుందాం. అంటే... 1100+1000=2100 పై 10 శాతం లెక్కన 210 రూపాయలకు దానికి యాడ్ అవుతుంది. అది హైదరాబాద్ వచ్చేసరికి దాని ధర అవుతుంది. అంటే.. రూ.2310 ధర అన్నమాట.. ఇదంతా పాత పన్ను విధానం.
... అదే జీఎస్టీ అమల్లోకి వస్తే.. ఢిల్లీలో రూ.1000 ఉన్న ఆ వస్తువుపై 10 శాతం పన్ను యాడ్ అయి ముంబయిలో రూ.1100 అవుతుంది. దానికి అక్కడ వర్తకుడు జోడించిన రూ.1000 లాభం కలుపుకున్న తరువాత 10 శాతం మళ్లీ పన్ను వేసినా కూడా ఆ 10 శాతం కేవలం రూ.1000పైనే వర్తిస్తుంది. అంటే మరో 100 మాత్రమే పెరుగుతుంది. అప్పుడు హైదరాబాద్ లో దాని ధర 1100+1000+100=2200 అవుతుంది. అంటే పాత పన్ను విధానంలో కంటే జీఎస్టీలో అంతిమంగా వినియోగదారుడి వద్దకు వచ్చే సరికి ధర తగ్గుతోంది.
ప్రభుత్వానికి ప్రయోజనం ఇలా..
మరి ప్రజలపై పన్ను తగ్గుతుంటే.. ఇప్పుడున్న పన్ను కట్టే తక్కువ పన్ను వేస్తుంటే ప్రభుత్వానికి లాభమేంటన్న ప్రశ్న వస్తుంది. కానీ... ఇది ప్రభుత్వాలకు లాభదాయకమే. ముఖ్యంగా పన్నుల వసూళ్ల ప్రక్రియ సులభతరం అవుతుంది. అయిదారు రకాల పన్నులకు బదలు ఒకటే జీఎస్ టీ వసూలు చేస్తారు కాబట్టి పన్నులు ఎగ్గొట్టే ఛాన్సు తగ్గిపోతుంది. మరోవైపు పన్నుల భారం తగ్గుతుంది కాబట్టి వర్తకులు - వ్యాపారస్థులు కూడా కట్టడానికి ఇష్టపడతారు. వివిధ దశల్లో పన్నుల వసూళ్లకు ప్రభుత్వం చేసే ఖర్చు తగ్గి ఖజానాపై భారం గణనీయంగా తగ్గుతుంది.
మనకూ బెనిఫిట్టే..
ప్రజలకు కొన్ని రకాలైన వస్తువులపై పన్ను భారం తగ్గుతుంది. ఇప్పుడు చెల్లిస్తున్న పన్నులతో పోల్చితే తక్కువ పన్ను చెల్లించి వస్తువులను సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాలైన పన్నులను తొలగించి వాటి స్ధానంలో ఒకటే జీఎస్ టీని అమలు చేస్తున్నందున స్ధానికంగా తయారయ్యే వస్తువుల ధరలు తగ్గుతాయి. వివిధ రకాలైన పన్నుల స్ధానంలో ఒకటే పన్ను చెల్లిస్తే సరిపోతుంది కాబట్టి వినియోగదార్లకు తాము ఎంత పన్నుల భారాన్ని మోస్తున్నామనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇవీ ప్రయోజనాలు
- ఏకీకృత జాతీయ మార్కెట్ ఏర్పడుతుంది. జీఎస్టీ బిల్లుతో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ప్రోత్సాహమివ్వడంతో పాటు ఎగుమతులకు అవకాశం ఉంటుంది.
- మెరుగైన రాబడి అందడం ద్వారా ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి.
- చాలావరకు పన్నులు తగ్గుతాయి. సహేతుకమైన పన్నులు ఉంటాయి.
- పన్ను విధానం సరళం కావడం.. చెల్లింపు సులభం కావడంతో పన్ను చెల్లించేవారు పెరుగుతారు.
- పన్ను పరిధిలోకి వచ్చేవారు పెరగడం.. ఎగవేతలు తగ్గడం వల్ల ఆదాయం పెరుగుతుంది.
కొంత మోదం.. కోంత ఖేదం
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బిల్లును అమలులోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తున్న వేళ జీఎస్టీ అమలైతే స్థూలంగా ప్రయోజనమే అయినప్పటికీ కొన్నిటి ధరలు పెరిగే అవకాశాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేటి ధరలు పెరుగు తాయో వేటి ధరలు తగ్గుతాయో ఓ సారి పరిశీలిస్తే...
ధరలు పెరిగేవి :
సిగరెట్లు - ఖైనీ - తదితరాలు
సెల్ ఫోన్లు - దుస్తులు - బ్రాండెడ్ ఆభరణాల ధరలు
ధరలు తగ్గేవి:
బేసిక్ మోడల్ కార్లు - ద్విచక్ర వాహనాలు -
కారు - బ్యాటరీలు - పెయింట్ - సిమెంట్ ధరలు తగ్గుతాయి.
వినోదం పన్ను గణనీయంగా తగ్గుతుంది కాబట్టి సినిమా
టిక్కెట్ ధరలు దిగివస్తాయి.
ఫ్యాన్లు - లైటింగ్ - వాటర్ హీటర్లు - కూలర్లు తగ్గుతాయి.
ఈ ఏడాదికి లేనట్లే..
ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణ తర్వాత జీఎస్ టీ అమలు విషయంలో 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాలు ఆమోదించాలి. తదుపరి జీఎస్ టీ అమలు విధానం - పన్ను రేటును నిర్ణయిస్తూ ప్రత్యేక బిల్లు పెట్టి ఆమోదిస్తారు. అన్ని అవరోధాలు అధిగమించి వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జీఎస్ టీ ని అమల్లోకి తీసుకురావాలనేది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది వస్తుందని అనుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా జీఎస్ టీ సగటు 20 శాతం ఉంది.. మన దేశంలో ఇది 18 శాతంగా నిర్ణయమవుతుందని భావిస్తున్నారు.
ఒకే పన్ను తరువాత రద్దయ్యే పాత పన్నులు
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న కేంద్ర ఎక్సైజ్ పన్ను - అదనపు ఎక్సైజ్ డ్యూటీ - సేవల పన్ను - అదనపు కస్టమ్స్ పన్ను (సీవీడీ) - కస్టమ్స్ పై ప్రత్యేక అదనపు డ్యూటీ - కేంద్ర అమ్మకం పన్ను - ఎక్సైజ్ డ్యూటీ అండర్ మెడిసినల్ అండ్ టాయిలెట్రీస్ ప్రిపరేషన్ యాక్ట్ రద్దవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యాట్/ అమ్మకం పన్ను - వినోదపు పన్ను ఆక్ట్రాయ్/ ఎంట్రీ ట్యాక్స్ - కొనుగోలు పన్ను - లగ్జరీ పన్ను - లాటరీ- బెట్టింగ్- గ్యాంబ్లింగ్ పై విధించే పన్నులు కూడా ఉండవు.
జీఎస్ టి బిల్లువల్ల ఏ రంగాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. ఈ కంపెనీల షేర్లు ఎలా స్పందిస్తాయనేది నోమురా సంస్థ ఒక నివేదిక తయారుచేసింది. జీఎస్ టి వాస్తవ రూపం దాల్చితే ప్రారంభంలో ఆహార పదార్థాల ధరలు పెరిగినా.. తర్వాత కాలంలో దీంతో లాభాలు కూడా ఉంటాయని అభిప్రాయపడింది.వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుతాయి. అంతరాష్ట్ర చెక్ పోస్టుల బెడద తగ్గడంతో త్వరగా చెడిపోయే వస్తువులు కూడా వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుతాయి. జీఎస్ టి అమల్లోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తులపై విధించే మండీటాక్స్ - అంతరాష్ట్ర పన్నులు మటుమాయం అవుతాయి.
ఇంకా ఏమేం మార్పులొస్తాయి..
- జీఎస్ టి రేటు 18 శాతం నిర్ణయిస్తే కార్ల ధరల్లో 10-17 శాతం వరకు తగ్గుతాయి. దానివల్ల కార్లు - అనుబంధ రంగాల సంస్థలైన మారుతి సుజుకి - హీరోమోట కార్ప్ - ఎక్సైడ్ - అమరారాజా - ఐచర్ మోటార్ - మహీంద్రా అండ్ మహీంద్రా బజాజ్ - ఆటో షేర్లు పుంజుకోవచ్చు..
- ఈ పన్ను ఫార్మా రంగానికి కొంత ఇబ్బందే. ఈ రంగంపై పరోక్ష పన్నుల భారంపడుతుంది. పరోక్ష పన్నులు 60 శాతం వరకు చెల్లించాల్సి వస్తుందని.. దీం తో ఔషధాల ఎంఆర్పీ నాలుగు శాతం పెరుగుతాయని చెబుతున్నారు. అల్కెమ్ - గ్లాక్సో ఫార్మా వంటి మందుల సంస్థల షేర్లు పతనమయ్యే ప్రమాదముంది.
- గృహాల్లో వినియోగించే వస్తువులతో పాటు - పర్సనెల్ కేర్ వస్తువులు ధరలు సుమారు 200 నుంచి 500 బేసిస్ పాయింట్లు తగ్గుతాయి. గోదాములు - రవాణా ఖర్చులు తగ్గుతాయి.
- వర్క్ కాంట్రాక్టు పన్నుపై స్పష్టత రావడంతో ఈ రంగానికి మంచి లబ్ది చేకూరుతుంది. దీంతో లిటిగేషన్లు తగ్గుతాయి. సేల్స్ అండ్ సర్వీసెస్ మధ్య వ్యత్యాసం పూర్తిగా తొలగిపోతుంది.
- రవాణా రంగం లాభపడుతుంది. సెంట్రల్ సేల్స్ టాక్స్ - అంతరాష్ట్ర వాల్యూ యాడెడ్ టాక్స్ పూర్తిగా తొలగిపోయి లాజిస్టిక్ కంపెనీలు లాభపడతాయి. ఈ కంపెనీలు గిడ్డంగులతో పాటు లాజిస్టిక్ చెయిన్ లను (రవాణా)ను మరింత మెరుగుపర్చుకోవచ్చు.
- ముడిచమురు - సహజ వాయువు - హైస్పీడ్ డిజిల్ - ఎటీఎఫ్ లను జీఎస్ టి పరిధిలో చేర్చలేదు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పరోక్షపన్నులు రెట్టింపు అయ్యే అవకాశం.
- ఈ రంగంపై మొత్తం పన్నులు తగ్గుతాయి. దీంతో పాటు రవాణా వ్యయం తగ్గడం కూడా కలిసివస్తుంది. ఈ లబ్దిని వినియోగదారుడికి బదలీ చేయవచ్చు. దీంతో డిమాండ్ పెరగవచ్చు. ప్లాంట్ లలో వినియోగం పెరగవచ్చు..